మౌర్యుల కాలంలో తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే వరకు ఆర్థికవేత్త చాణక్యుడు సిగను ముడివేయనని శపథం చేశారని చెబుతారు. అచ్చు అలాంటి నిర్ణయమే తీసుకుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. తన తండ్రిని చంపిన నిందితులకు శిక్ష పడే వరకూ తన తలపై వెంట్రుకలు పెంచుకోనని ప్రతిజ్ఞ చేసింది. రోజూ గుండు కొట్టించుకుంటోంది.
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని నవాదా ప్రాంతం సుందర్ కాలనీ వాసి, విశ్రాంత ఇంజినీర్ యోగేంద్ర సింగ్... కొద్ది రోజుల క్రితం భవనంపై నుంచి కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి కుమార్తె పునీత.. పక్కింటివారే తన తండ్రిని హత్య చేశారని ఆరోపిస్తోంది. అనుమానితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
కానీ నిందితులను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా పునీత గుండు కొట్టించుకుంది. తన తండ్రిని బలిగొన్నవారికి శిక్షపడేవరకు ఇలానే ఉంటానని శపథం చేసింది. అందుకే ప్రతిరోజూ శిరోముండనం చేయించుకుంటోంది.
తండ్రి మృతిపై మైనారిటీ కమిషన్లోనూ ఫిర్యాదు చేసింది పునీత. స్పందించిన అధికారులు... కేసు పూర్తి వివరాలతో ఈనెల 18న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు