భాజపా సిద్ధాంతాలకు కేంద్ర బిందువైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు పుట్టినిల్లు నాగ్‌పుర్. బీఆర్ అంబేడ్కర్ 1956లో బౌద్ధమతం స్వీకరించడానికి కేంద్రమైన దీక్షాభూమి కూడా నాగ్పుర్లోనే ఉంది. ఈ రెండు సంఘాలే ఇక్కడ గెలుపోటముల్ని నిర్ణయిస్తాయి.
ఇదీ చూడండి:పాలు, సైకిల్, పొయ్యి- కాదేదీ చందాకు అనర్హం
భాజపాకు దూరం...
బౌద్ధ మతం స్వీకరించిన ఎస్సీల ప్రభావమే ఎన్నికల ఫలితాలపై అధికం. 2014 ఎన్నికల్లో భాజపాకు దన్నుగా నిలిచిన వీరు ఈసారి ప్రత్యమ్నాయం దిశగా ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
''ఈసారి సాధారణంగా ఎస్సీల ధోరణి భాజపాకు వ్యతిరేకం. ఈ ఓట్లు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, ప్రకాశ్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాడీ, మాయావతి బీఎస్పీకి చీలిపోయే అవకాశముంది. ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఆ పార్టీలన్నీ కలిసిరావడమే.''
- సుఖ్‌దేవ్ థోరాత్, యూజీసీ మాజీ ఛైర్మన్
సుఖ్‌దేవ్ అంచనాలను భాజపా విశ్వసించట్లేదు. దళిత బౌద్ధుల ఓట్ల శాతం గతం కంటే గడ్కరీకి విపరీతంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు ఉత్తర నాగ్‌పుర్ భాజపా ఎమ్మెల్యే మిలింద్ మానే. 2014లో 3 నుంచి 7 శాతం ఓట్లు పడితే... ఇప్పుడా సంఖ్య 27కు చేరుతుందని ధీమాగా చెప్పారు.
''కేవలం అభివృద్ధి పనులతోనే ఇది సాధ్యంకాలేదు. బలహీనవర్గాల అభ్యున్నతికి భాజపా నాయకత్వం కృషి చేయడం వల్లే బౌద్ధులు భాజపాను నమ్మడం ప్రారంభించారు. దీక్షాభూమికి గడ్కరీ సమప్రాధాన్యం ఇస్తున్నారు. బలహీనవర్గాలు, ముస్లింలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు.''
- మిలింద్ మానే, ఉత్తర నాగ్‌పుర్ ఎమ్మెల్యే, భాజపా
నాగ్‌పుర్ పరిధిలోని 50 శాతం మంది ఓటర్లు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందినవారే. ఇందులో ఎక్కువగా కుణ్బీ, తెలి సామాజిక వర్గానికి చెందినవారు. మిగతా 15-20 శాతం ఎస్సీలు(హిందువులు, బౌద్ధులు). ముస్లిం ఓటర్లు 12 శాతం.
భాజపాపై ఎస్సీల్లో ఆగ్రహం పెరిగిపోయిందని, వారు పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నది కాంగ్రెస్ నేతల మాట.
''రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఆరెస్సెస్ సిద్ధాంతాలు, భావజాలాల మేరకే భాజపా నడుచుకుంటోంది. భాజపా విధివిధానాలు, నిర్ణయాలపై ఆగ్రహంతో దళితులు వారికి దూరం కానున్నారు. గడ్కరీకి ప్రజల్లో మంచి పేరు ఉండొచ్చు. కానీ.. బౌద్ధ వర్గం ముందున్న అభ్యర్థి ఎవరనేది చూడరు. భాజపాను తరమాలన్నదే వారి ధ్యేయం.''
- నితిన్ రౌత్, కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్, ఎమ్మెల్యే
గడ్కరీ ప్రభావం ఉండదు....
గడ్కరీకి ప్రధాన ప్రత్యర్థి నానా పటోలే. 2014లో భండారా-గోందియా నియోజకవర్గంలో భాజపా తరఫున ఎంపీగా గెలిచారు పటోలే. గడ్కరీతో కలిసి పనిచేశారు. అనంతరం 2017లో పార్టీని, పార్లమెంటును వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు సహచరుడిపైనే పోటీకి దిగారు పటోలే.
''ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు. నాయకుడు కాదు. అందువల్ల.. ప్రజల కంటే బలమైన దానిని నేనెప్పుడూ చూడలేదు. గడ్కరీ మంచి పేరు, వ్యక్తిత్వం పెద్దగా ప్రభావం చూపవు. కానీ.. నితిన్ నాకు పెద్దన్నయ్య లాంటివారు.''
- నానా పటోలే, కాంగ్రెస్ నేత
యూపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలున్నది మహారాష్ట్రలోనే. 2014 ఎన్నికల్లో మొత్తం 48 నియోజకవర్గాల్లో భాజపా 23, శివసేన 18 గెల్చుకున్నాయి. ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2కే పరిమితమయ్యాయి.
ఈ సారి భాజపా, శివసేన మధ్య ఎన్నో వైరుద్ధ్యాలొచ్చినా చివరకు కలిసే పోటీచేస్తున్నాయి. కమలదళం 25, సేన 23 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి.
ఇవీ చూడండి: