పర్యావరణ పరిరక్షణ గరించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అతనే దిల్లీ ఝలావర్‌కు చెందిన రాకేశ్ శర్మ.
సైక్లింగ్‌తో ఉపయోగాలెన్నో..
ప్రజలు సైకిల్‌ను ఉపయోగించడం బాగా తగ్గించిన తరువాత వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందని రాకేశ్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సైక్లింగ్ పర్యావరణానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని, అందుకే ప్రతిఒక్కరూ దీనిని అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.
అవగాహన కార్యక్రమం..
రాకేశ్ తన సైకిల్ యాత్రలో భాగంగా చిన్నా, పెద్దా నగరాల మీదుగా ప్రయాణిస్తూ దేవాలయాలు, గురుద్వారాల్లో బస చేస్తున్నాడు. అక్కడ స్థానికులతో మాట్లాడుతున్నాడు. సైకిల్ ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, డబ్బు కూడా ఆదా అవుతుందని వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ను మళ్లీ తమ ప్రధాన రవాణా సాధనంగా ఉపయోగించాలని రాకేశ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
సానుకూల స్పందన
తన ప్రయత్నాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని.. సైకిల్ యాత్రకు మంచి స్పందన వస్తోందని రాకేశ్ శర్మ తెలిపాడు. ఇప్పుడు చాలా మంది తిరిగి సైకిల్‌ను వాడడం ప్రారంభిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.
కాఠ్మాండు నుంచి దిల్లీ
రాకేశ్ శర్మ ఇంతకు ముందు కాఠ్మాండు నుంచి దిల్లీకి కూడా సైకిల్ యాత్ర చేశాడు. ఈ ప్రయాణంలో ఆయన 3 వేల మందితో మాట్లాడాడు. సైకిల్ ద్వారా పర్యావరణ పరిరక్షణ ఎలా చేయవచ్చో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.
ఇదీ చూడండి: బలనిరూపణకు ఈ నెల 30 వరకు గడువు- గెలుపుపై భాజపా ధీమా