చక్కగా పనిచేస్తున్న మీ పర్సనల్ కంప్యూటర్ల స్క్రీన్‌లపైన 'సాంకేతిక సమస్యలు', 'వైరస్ దాడి ముప్పు' పేరుతో హెచ్చరికల సందేశాలు ప్రత్యక్షమవుతున్నాయా? అది మిమ్మల్ని మోసగించేందుకు విసిరిన వల కావచ్చు! ఇలాంటి నకిలీ హెచ్చరికల సందేశాలకు స్పందించిన వారి కంప్యూటర్లలో 'యాంటీ వైరస్ సెక్యూరిటీ' పేరుతో మాల్‌వేర్‌ను చొప్పించి డబ్బు గుంజుతున్న సైబర్ కేటుగాళ్ల వంచనను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బహిర్గతం చేసింది. ఆరు కంపెనీలపై కేసు నమోదు చేసింది.
మైక్రోసాఫ్ట్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ.. జైపుర్, దిల్లీ, నొయిడా, ఫరిదాబాద్, మెయిన్‌పురిలలోని ఆయా కంపెనీలకు చెందిన 10 ప్రాంగణాలలో దాడులు నిర్వహించింది. దిల్లీకి చెందిన సాఫ్ట్‌విల్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సబూరి టీఎల్సీ వరల్డ్‌వైడ్ సర్వీసెస్ ప్రై.లి., జైపుర్ కేంద్రంగా పనిచేసే ఇన్నోవా థింక్‌ల్యాబ్స్ లిమిటెడ్, సిస్ట్వీక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, నొయిడాకు చెందిన బెనొవెలియంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, నొయిడా-గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న సబూరి గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. తమకు ఫోన్ చేసిన వారి కంప్యూటర్లలో వైరస్ దాడుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థను ప్రవేశపెట్టే సాకుతో మాల్‌వేర్‌ను చొప్పిస్తున్నాయి. లేని సమస్యలను పరిష్కరించినట్లు నమ్మిస్తూ భారీగా రుసుములు వసూలుచేస్తున్నాయని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ తెలిపారు. విదేశాల్లో పీసీలను వాడే వారికి కూడా ఇక్కడి నుంచే ఇలాంటి బూటకపు హెచ్చరికలు పంపిస్తున్నట్లు సీబీఐ దృష్టికి వచ్చింది.
ఇదీ చూడండి:- 'బ్లాక్‌రాక్' మాల్వేర్తో బ్యాంకింగ్ డేటా ఉఫ్