ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష, ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) విమర్శించింది. కశ్మీర్‌ను విభజిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై మంగళవారం రాత్రి సీడబ్ల్యూసీ సమావేశమైంది. ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ సహా పార్టీ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రియాంక గాంధీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
భాజపా భారత రాజ్యాంగాన్ని, జమ్ముకశ్మీర్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అతిక్రమించిందని విమర్శించింది. జమ్ముకశ్మీర్‌ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టింది.