మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ కసరత్తు తుది దశకు చేరింది. దిల్లీలో సమావేశమైన వర్కింగ్ కమిటీ... భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయకపోయినా... సానుకూల సంకేతాలు ఇచ్చింది కాంగ్రెస్.
సేనతో కలిసే...!
శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీతో కాంగ్రెస్ ఈరోజు మరోసారి సమావేశమవుతుందని తెలిపాయి. శివసేనతో ముంబయిలో రేపు భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మహా ప్రభుత్వ ఏర్పాటుపై రేపే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని స్పష్టం చేశాయి.
రెండు రోజుల్లో...
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో మరో రెండు రోజుల్లో తేలిపోతుందని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, డిసెంబరు 1లోగా పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు త్వరలో ముంబయిలో సమావేశమవుతురాని చెప్పారు రౌత్.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈ వారం భేటీ అవుతారనే విషయంపై కచ్చితమైన సమాచారం లేదన్నారు రౌత్.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కుమార్తె ప్రసవ వేదన