జమ్ము కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థాయికి తెచ్చేందుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను పరిశీలించేందుకే విదేశీ ప్రతినిధుల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. 'గైడెడ్ టూర్' అంటూ విపక్షాలు చేసిన విమర్శలను తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన, అసత్య ప్రచారాలని తిప్పికొట్టారు. ఐరోపా ప్రతినిధులతో కలిసి భవిష్యత్తులో కశ్మీర్ పర్యటన నిర్వహిస్తామని వెల్లడించారు.
"కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం సహా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నెలకొన్న సాధారణ పరిస్థితులను గమనించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం."
-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి
పర్యటనలో భాగంగా ప్రతినిధులు కశ్మీర్‌లోని పౌరులు, రాజకీయ నాయకులు, భద్రత అధికారులతో పాటు మీడియాను కలిసినట్లు రవీశ్ వెల్లడించారు. భద్రత పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ పర్యటన ఖరారు చేసినట్లు తెలిపారు.
15 మంది విదేశీ ప్రతినిధులు ప్రస్తుతం కశ్మీర్లో పర్యటిస్తున్నారు. భారత్‌లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సైతం రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్ము కశ్మీర్‌కు చేరుకున్నారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత ఓ విదేశీ దౌత్యవేత్త రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
ఇరాన్ ఉద్రిక్తతలపై స్పందన
పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులను భారత్ సునిశితంగా పరిశీలిస్తోందని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. తాజా పరిస్థితులపై ఆ ప్రాంతంలోని కొన్ని దేశాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.