"2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 185మంది క్రిమినల్ కేసులున్నాయి. 21మంది కేబినెట్ మంత్రులపై సర్వే జరిపితే.... 20మందిపై నేరారోపణలు ఉన్నట్లు తేలింది. అందులో 11 మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి."
--అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ నివేదిక
"పార్లమెంటు, రాష్ట్ర చట్టసభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 4,896. వీరిలో 1,765... అంటే 36శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయి. వీరు 3,045 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు"
--2018 మార్చిలో సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్
రెండు వేర్వేరు నివేదికలు. సారాంశం ఒక్కటే. రాజకీయాలు నేరమయం అయ్యాయని. ఈ సమస్యకు కారణమేంటి? నివారణ మార్గాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది ఈటీవీ భారత్. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్-ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగ్దీప్ చోకార్తో మాట్లాడింది.
నేరపూరిత రాజకీయాలు అనే సమస్యను ఎలా పరిగణించాలి?
''నేరపూరిత రాజకీయాలు... భారత్లో అతిపెద్ద సమస్య. ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే దేశంలో 30% మంది నిబంధనలను ఉల్లంఘించి పార్లమెంటు లేదా అసెంబ్లీల్లో కూర్చుంటున్నారు. చట్టాన్ని అతిక్రమించడం లేదా గుప్పెట్లో ఉంచుకోవటం చేస్తున్నారు. ఇలాంటి వారందరిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే.''
2009లో 30%, 2014లో 34% మంది నేర చరిత్ర గల అభ్యర్థులు పార్లమెంటుకు వెళ్లారు. ఈ పరిస్థితికి కారణమేంటి?
''నా దృష్టిలో ఈ సమస్యకు ప్రధాన కారణం రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం. సమాజంలో నేరాలు పెరగడానికి కారణం నేర ప్రవృత్తి ఉన్న అభ్యర్థులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వడమే. నేరచరిత్ర తెలిసే పార్టీలు వారికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇదే రాజకీయాల్లో నేరస్థులు పెరగడానికి కారణం. నేరపూరిత రాజకీయాలకు, నల్లధనానికి దగ్గర సంబంధం ఉంది. ఎన్నికల ప్రచారాల్లో నల్లధనం ఇలాంటి వారి దగ్గర నుంచే చేరుతుంది.''
ఏ రాజకీయ పార్టీకి చెందినవారు ఎక్కువ నేర ప్రవృత్తి కలిగిన వారున్నారు?
ఈ సమస్యకు ఏ ఒక్క పార్టీ అతీతం కాదు. ఏదైనా ఒక పార్టీలో 100% ఎంపీలు, ఎమ్మెల్యేలకు నేర ప్రవృత్తి ఉన్నా... మరో పార్టీలో 2% అభ్యర్థులకు నేరచరిత్ర ఉన్నా రెండూ సమానమే. నేరచరిత్ర ఉన్న ఏ ఒక్క అభ్యర్థినీ చట్టసభలకు పంపకుండా చర్యలు తీసుకోవాలి.
రాజకీయాలు నేరమయం కాకుండా అరికట్టేందుకు మీరేం సలహాలిస్తారు?
ఎన్నో నివారణ మార్గాలున్నాయి. ప్రజాభిప్రాయం, న్యాయవ్యవస్థ, మీడియా ద్వారా ఈ సమస్యపై ప్రచారం చేసి, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలి. ఇలా చేయనంతవరకు వీరు రాజకీయాల్లో విజయం సాధించాలనే ఆలోచనతోనే ఉంటారు.''