ఆన్లైన్ ప్రచార రథాలు, వర్చువల్ ర్యాలీలు, వ్యూహప్రతివ్యూహాలు.. ఓ వైపు. కీలక నేతల రాజీనామాలు, కూటమిలో లుకలుకలు మరోవైపు.. ఇది ఎన్నికల ముందు బిహార్‌లో పార్టీల పరిస్థితి.
ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (భాజపా), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో ఎన్డీఏ పటిష్ఠంగా కనిపిస్తోంది.
- ఇదీ చూడండి: బిహార్ ఎన్నికల ముందు ఆర్జేడీకి షాక్
ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ).. పార్టీలో లుకలుకలు, కీలక నేతల రాజీనామాలతో ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం పరిస్థితులు పైకి ఇలానే కనిపిస్తున్నా.. ఎన్డీఏలోనూ తాజాగా ఓ గుబులు మొదలైంది.
సీట్ల పంపకంలో...
శాసనసభ ఎన్నికల సీట్ల పంపకంలో ఎన్డీఏ ఇచ్చిన ఆఫర్‌పై ఎల్జేపీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 33 సీట్లు కేటాయించేందుకు ఎన్డీఏ సిద్ధమవగా... 43 సీట్ల కన్నా తక్కువ తీసుకునేది లేదని ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
వేగంగా పావులు కదిపిన ఆర్జేడీ... మహాకూటమిలో చేరితే ఎల్జేపీకి 52 సీట్లు కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
తెగదెంపులు...
ఎన్డీఏలో జేడీయూకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై పాసవాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. డిమాండ్లను నేరవేర్చలేని పక్షంలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకునేందుకు పాసవాన్ వెనకాడేది లేదని సమాచారం.
బుజ్జగింపులు...
ఈ నేపథ్యంలో ఎల్జేపీని బుజ్జగించేందుకు భాజపా బిహార్ బాధ్యుడు భూపేంద్ర యాదవ్ రంగంలోకి దిగారు. గత నాలుగు రోజుల్లో చిరాగ్ పాసవాన్‌తో రెండుసార్లు భేటీ అయ్యారు.
వేగంగా ఆర్జేడీ...
ఎన్డీఏలో జరుగుతోన్న కీలక పరిణామాలను ప్రతిపక్ష ఆర్జేడీ నిశితంగా పరిశీలిస్తోంది. వేగంగా పావులు కదుపుతోంది. ఎల్జేపీ.. మహాకూటమిలో చేరితే రానున్న ఎన్నికల్లో 52 సీట్లు కేటాయిస్తామని పాసవాన్‌కు తేజస్వీ యాదవ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే పాసవాన్‌తో నేరుగా తేజస్వీ యాదవ్ మాట్లాడకపోయినా.. ఈ మేరకు సందేశం పంపారట.
ఎన్డీఏ సిద్ధంగా లేదు...
బిహార్‌లో ఏకఛత్రాధిపత్యం చలాయించేంత లేకున్నా.. నిమ్నవర్గాల్లో ఎల్జేపీకి మంచి పట్టు ఉంది. కనుక ఎల్జేపీని వదులుకునేందుకు ఎన్డీఏ సిద్ధంగా లేదు. అందుకే పలు దఫాల్లో పాసవాన్‌తో చర్చలు జరపాలని భాజపా అధిష్ఠానం ఆదేశించిందట.
- ఇదీ చూడండి: బిహార్ సమరం: కాలం చెల్లిన కులం కార్డు!
బిహార్‌లో ప్రస్తుత పరిస్థితులపై 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ముఖాముఖిలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ పలు విషయాలు వెల్లడించారు.
ఎలాంటి విభేదాలు లేవు...
ఎన్డీఏలో ఎలాంటి విభేదాలు లేవని.. ఐకమత్యంగా ఉన్నామని భూపేంద్ర యాదవ్ అన్నారు. ఎన్డీఏ సీనియర్ నేత, చిరాగ్ పాసవాన్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ చెప్పినట్లే రాష్ట్రంలో ముందుకు వెళ్తామన్నారు.
గెలుపు మాదే...
రాష్ట్రంలో ఎన్డీఏ బలంగా ఉందని... రాబోయే ఎన్నికల్లో మూడు నుంచి నాలుగు వంతుల మెజార్టీ సాధిస్తామని భూపేంద్ర ధీమా వ్యక్తం చేశారు.