ఈ స్థానం నుంచి కన్నయ్య పోటీ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఎంపీగా గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆరా, ఉజిఅర్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎం)లకు మద్దతివ్వనున్నట్లూ పేర్కొంది. ఖగడియా స్థానంలోనూ సీపీఐ పోటీ చేయాలని భావిస్తోంది. దీనిపై నేడు స్పష్టతనివ్వనుంది.
'' మేం ఇంతకుముందు బెగూసరాయ్ అభ్యర్థిగా కన్నయ్య కుమార్‌ను పార్టీ తరఫున ప్రతిపాదించాం. ఇప్పుడు అధిష్టానం నుంచి ఆమోదం లభించింది. అధికారికంగా బెగూసరాయ్ అభ్యర్థిగా కుమార్ ఉన్నారు. అతను ఎంపీ అవుతారనడంలో మాకెలాంటి సందేహం లేదు.''
- కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
'ఎన్డీఏను ఓడించడానికి మహాకూటమికి మద్దతిస్తాం. కానీ... వామపక్షాల అభ్యర్థులు పోటీ లేని స్థానాల్లోనేనని' స్పష్టం చేశారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ్ సింగ్. మోదీ వ్యతిరేక పోరాటానికి చిహ్నంగా కన్నయ్య నిలుస్తారని, తప్పకుండా గెలిపించుకు తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహాకూటమిలోనే భాగంగా ఉన్న ఆర్జేడీ కూడా బెగూసరాయ్ నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఏ పేరునూ ప్రకటించలేదు కానీ తన్వీర్ హసన్‌ను పోటీకి దించాలని చూస్తోంది.
మొదట నుంచీ బెగూసరాయ్‌లో కన్నయ్య అభ్యర్థిత్వంపై వ్యతిరేకంగానే ఉంది ఆర్జేడీ. ప్రజాదరణ లేదని, అగ్రవర్ణాల ఓట్లలో కోత పడుతుందని కన్నయ్య టికెట్‌కు అడ్డుపడుతూ వచ్చారు ఆర్జేడీ అధినేత లాలూ. అయితే.. తేజస్వీ యాదవ్‌కు కన్నయ్య పోటీగా మారకూడదన్న యోచనతోనే... బెగూసరాయ్ టికెట్ కేటాయించేందుకు లాలూ వెనకాడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.