కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమాన సేవలు ఈ వారం ప్రారంభంకానున్నాయి. శాన్ఫ్రాన్సిస్కో నుంచి తొలి విమానం భారత్‌కు బయలుదేరే అవకాశముంది. తేదీల్లో స్పష్టతలేనప్పటికీ.. శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో నుంచి ఈ విమానాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
అయితే వైరస్ వల్ల విధించిన ఆంక్షలతో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పర్యటకుల సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వారాల్లో అనేక విమానాలను నడిపే అవకాశముంది.
స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న వారి జాబితాను అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం రూపొందిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫాంను అందుబాటులో ఉంచింది.
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మే 7నుంచి స్వదేశానికి తీసుకోస్తున్నట్టు భారత ప్రభుత్వం సోమవారం ప్రకటింది. ఈ నిర్ణయాన్ని అమెరికాలోని వివిధ సంఘాల నేతలు స్వాగతించారు. అధిక సంఖ్యలో భారత పర్యటకులు, విద్యార్థులు, వృద్ధులు అమెరికాలో చిక్కుకుపోయారన్నారు. వీరందరినీ స్వదేశాలకు తీసుకెళ్లడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
యూఏఈకి...
మాల్దీవులు, యూఏఈలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మూడు నౌకలను పంపించింది భారత ప్రభుత్వం. మంగళవారం తెల్లవారుజామున ఈ నౌకలు బయలుదేరాయని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.
ముంబయి తీరంలోని ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్‌ను మాల్దీవులకు.. ఐఎన్ఎస్ శార్దూల్‌ను దుబాయికి మళ్లించినట్టు పేర్కొన్నారు. మూడు నౌకలు కేరళలోని కొచ్చికి తిరిగిరానున్నాయి.