భౌతిక దూరం పాటించమంటే అత్యుత్సాహానికి పోయి సామాజిక వివక్ష చూపుతున్నారు కొందరు. కరోనా అనుమానాలతో సాటి మనుషులను మానసికంగా హింసిస్తున్నారు. ఇరుగుపొరుగువారి వేధింపులు తట్టుకోలేక ఇంటినే అమ్మకానికి పెట్టాడు మధ్యప్రదేశ్లోని ఓ కరోనా జయుడు.
శివపురికి చెందిన ఆ వ్యక్తి.. మార్చి 18న దుబాయ్ నుంచి భారత్కు వచ్చాడు. అతడికి మార్చి 24న కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఫలితంగా అతడి తల్లి, తండ్రి, సోదరిని నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే ఆత్మవిశ్వాసంతో కరోనాను జయించి ఈ నెల 4న ఇంటికి చేరుకున్నాడు. అయితే గృహానికి రాగానే ఇరుగుపొరుగువారి ప్రవర్తన ఆ కుటుంబాన్ని కరోనా కంటే ఎక్కువ బాధకు గురి చేసిందట. వారిని నేరస్థులుగా చూస్తుంటే తట్టుకోలేకపోయిన వాళ్లంతా... సొంతూరు వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు! అంతేకాకుండా ఇష్టంతో కట్టుకున్న సొంతింటిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు.
" సమాజం మమ్మల్ని బహిష్కరిస్తుంటే సహించలేకపోతున్నాం. ఈ కాలనీలో ఇంక్కొక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. మా ఇంటికి పాలవాడిని, కూరగాయలవాడిని కూడా రానివ్వట్లేదు ఇరుగుపొరుగువారు. అందుకే ఇంటిని విడిచివెళ్లడం ఇష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకున్నాం."
-బాధితుడి తండ్రి
ఈ సమస్యపై వారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. పాత గొడవలే కాలనీవాసుల ప్రవర్తనకు కారణం కావచ్చని భావిస్తున్నారు.
"కరోనా నిర్ధరణకు ముందు బాధిత కుటుంబం నిర్బంధ సమయంలో బయట తిరిగారు. బహుశా ఆ సమయంలోనే గొడవలు తలెత్తి ఉంటాయి. ఆ కుటుంబం నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే వారికి ఎలాంటి సాయం కావాలన్నా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం."
-రాజేశ్ చంఢేల్, పోలీస్.