కరోనా వ్యాప్తితో దిల్లీలో వైద్య నిర్బంధ కేంద్రాలుగా వినియోగిస్తున్న మూడు ప్రైవేటు హోటళ్లలో సదుపాయాలు పొందిన వారు.. అందుకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ తన్వీ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా లక్షణాలున్న వారు, వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దిల్లీలో గల ఏరోసిటీలోని లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్, ఐపీఐఎస్ అనే మూడు హోటళ్లలో ప్రభుత్వం నిర్బంధ సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
అయితే.. ఈ మూడు హోటళ్లలో సౌకర్యాలు పొందిన వారు రోజుకు 3,100 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తరహా హోటళ్లలో మూడు పూటల భోజనం, వై ఫై సదుపాయం, టీవీ వంటి సేవలు కల్పిస్తారు. ఈ ఉత్తర్వులను పాటించనివారికి జరిమానా విధిస్తామని గార్గ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాల్లో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం వారికి అందిస్తున్న సేవలన్నీ ఉచితమేనని ప్రభుత్వ అధికారు ఒకరు తెలిపారు.
ముంబయిలో మరో వ్యక్తి కరోనా వైరస్‌తో మరణించగా..మంగళవారం నాటికి దేశంలో మృతుల సంఖ్య 3కు చేరింది.