లాక్డౌన్ సడలింపుల తర్వాత భారత్‌లో కరోనా విజృంభిస్తోంది! శుక్రవారం రికార్డుస్థాయిలో 6వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1లక్ష 18,447 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 148 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3,583కు చేరింది. 48,534 మంది కొవిడ్‌నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వరుసగా ఆరో రోజు రెండువేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కొత్తగా 2,940 మందికి మహమ్మారి సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 44,852 మంది వైరస్ బారిన పడినట్లు పేర్కొన్నారు. మరో 63 మంది చనిపోగా.. మరణించిన వారి సంఖ్య 1,517కు పెరిగిందని స్పష్టం చేశారు అధికారులు.
600కుపైగా కేసులు
దిల్లీలోనూ రికార్డుస్థాయిలో 660 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 12,319కి చేరింది. ఇప్పటివరకు 208 మంది మృత్యువాత వడ్డారు.
13వేలుకు పైగా బాధితులు..
గుజరాత్లో కొత్తగా 363 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,273 మందికి వైరస్ సోకింది. మరో 29మంది కొవిడ్‌తో మరణించారు. మెత్తం 802 మంది మహమ్మారికి బలయ్యారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శుక్రవారం కొత్త కేసులు నమోదయ్యాయి.
వారినుంచే కొత్తకేసులు
ఇటీవలే శ్రామిక్ రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వలసదారుల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో తిరిగి వచ్చిన వారికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ అవుతున్నట్లు స్పష్టం చేశారు.
లాక్డౌన్ విధించకుండా ఉన్నట్లైతే.. ఇప్పటికి దేశంలో 30 లక్షలకు పైగా వైరస్ కేసులు పెరిగేవని కొన్ని నివేదికలు తెలిపాయి. సుమారు 2.1 లక్షల మంది మరణించే వారని పేర్కొన్నాయి.