దేశంలో కరోనా వైరస్(కొవిడ్-19) బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో ఓ 63 ఏళ్ల వృద్ధురాలికి, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తికి ఈ ప్రాణాంతక వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 43కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
కేరళ చిన్నారి..
ఇటీవల కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటలీలో పర్యటించింది. అనంతరం మార్చి 7న వారు భారత్‌కు తిరిగిరాగా.. కోచి విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు అధికారులు. కరోనా అనుమానంతో చిన్నారి, ఆమె తల్లిదండ్రులను వేరుగా ఉంచారు. వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పరీక్షా ఫలితాల మేరకు చిన్నారికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. సోమవారం.. ఎర్నాకుళం మెడికల్ కాలేజీలోని ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. చిన్నారి తల్లిదండ్రుల మెడికల్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
కశ్మీర్లో..
జమ్ముకశ్మీర్ కార్గిల్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కూడా కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఇటీవల ఆమె ఇరాన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో లద్దాఖ్‌లో అనారోగ్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడు కరోనా కారణంగా మృతి చెందాడా అనే అంశమై శవపరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.
కరోనా భయంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నిఘా నీడలో కేరళ 'అట్టుకల్' వేడుక