కేరళలోని అట్టుకల్ అమ్మవారి దేవాలయాన్ని మహిళా శబరిమలైగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రధాన పూజలు, అర్చనల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఈస్ట్ ఫోర్ట్ ప్రాంతంలో ఈ క్షేత్రం నెలకొంది. ఇక్కడ జరిగే అట్టుకల్ పొంగల్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కేవలం మహిళలు మాత్రమే లక్షల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొంటారు.
ఎన్నో నెలల ముందు నుంచే ఈ పండుగకు ఏర్పాట్లు జరిగాయి. అయితే కరోనా వ్యాప్తి, కొత్తగా ఐదు వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పండుగ నిర్వహణకు ప్రభుత్వం చాలా ఆలోచించింది. ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
పండుగ నిర్వహణ నేపథ్యంలో వైద్య అధికారులు పలు సూచనలు చేశారు. జలుబు, జ్వరం సహా వైరస్ లక్షణాలున్న వారు వారి ఇంటి దగ్గరే పండుగ చేసుకోవాలని, సమూహంలో కలవకూడదని హెచ్చరించారు.
ఏర్పాట్లను ఆరోగ్య మంత్రి కేకే శైలజా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ పండుగలో భాగమయ్యేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు రానున్నారు. వారు హోటళ్లలోనే పండుగ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
మొత్తం 12 అంబులెన్స్‌లతో 23 బృందాలు పండుగ జరిగే ప్రదేశాల్లో ఉండనున్నాయి. పండుగలో పాల్గొనే వారిపై వీరు నిఘా పెట్టనున్నారు. తద్వారా అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
పండుగ ప్రత్యేకత...
అట్టుకల్ భగవతి అమ్మవారి చరిత్ర కేరళ, తమిళనాడుకు చెందిన పురాణగాథల్లో కనిపిస్తుంది. సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతిల సమ్మిళిత రూపం ఆమెది. ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
10 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి కీర్తనలు, భజనలు మార్మోగుతాయి. తొమ్మిదో రోజున అట్టుకల్ పొంగల్ జరుగుతుంది. వేకువజామునే మహిళలు ఆలయానికి చేరుకొని కట్టెలపొయ్యిలపై పొంగళ్లు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
- ఇదీ చూడండి: 'చపాతీ' ఆమె జీవితాన్నే మార్చేసింది!