కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సరికొత్త మైలు రాళ్లను చేరుకునే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎక్కవ మందికి టీకా అందించిన మూడో దేశంగా నిలిచింది. అమెరికా, బ్రిటన్ మాత్రమే భారత్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది.
ఇంకా ఏం చెప్పిందంటే..
- ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 2 లక్షలకు పైగా మందికి టీకా అందింది.
- ఉత్తర్ ప్రదేశ్లో అత్యధికంగా.. 6,73,542 మంది టీకా తీసుకున్నారు.
- ఫిబ్రవరి 7, ఉదయం 8 గంటల వరకు.. దేశంలో మొత్తం 57.75 లక్షల మందికి వ్యాక్సిన్ అందింది. వారిలో 53,04,546 మంది ఆరోగ్య సిబ్బంది కాగా.. 4,70,776 మంది కరోనా యోధులు ఉన్నారు.
- శనివారం నిర్వహించిన 8,875 సెషన్లలో 3,58,473 లబ్ధిదారులకు టీకా అందింది. ఇప్పటివరకు మొత్తం 1,15,178 వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించారు.
కరోనా టీకా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. దేశంలో తాజాగా 80 కంటే తక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 9 నెలల్లోనే ఇదే అత్యల్పం అని చెప్పింది.
కొత్త కేసుల వివరాలు ఇలా..
- దేశంలో ప్రస్తుతం 1.48 లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా బాధితుల్లో ఇది 1.05 శాతం మాత్రమే.
- కొత్తగా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 81.07 శాతం రికవరీలు నమోదయ్యాయి.
- కేరళలో కొత్తగా 6.178 మంది, మహారాష్ట్రలో 1,739 మంది, తమిళనాడులో 503 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- కొత్త కేసుల్లో 84.83 శాతం కేసులు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.
- కేరళలో అత్యధికంగా 5,942 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,768 కేసులు, కర్ణాటకలో 531 కేసులు వెలుగుచూశాయి.
- శనివారం 78 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం మరణాల్లో 69.23 శాతం ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో అత్యధికంగా 25 మంది మృతి చెందగా.. కేరళలో 16 మంది.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లో ఐదుగురు మృతి చెందారు.
17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు ఏవీ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.