చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక విషయాన్ని వెల్లడించారు. వివిధ మిషన్‌లకు మద్దతుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో 120 యుద్ధనౌకలను మోహరించినట్లు తెలిపారు. అంతర్జాతీయ భద్రతా సదస్సులో ప్రసంగించిన రావత్.. శాంతి, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే సముద్ర తీరాల్లోని సమాచార వ్యవస్ధ సురక్షితంగా ఉండడం చాలా కీలకం అని అన్నారు.
ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతం శాంతియుతంగానే ఉందని తెలిపారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఆధిపత్యం పెంచుకునేందుకు చైనాలో ఆర్థిక, సైనిక రంగాలు పోటీ పడి వృద్ధి చెందాయని రావత్ గుర్తు చేశారు. భాగస్వామ్య దేశాలతో శిక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్తులో మరింత బలపడేందుకు భద్రతా అంశాలను ఏకపక్ష నుంచి బహుపక్షంగా మార్చాలని బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు.
''శాంతి, సుసంపన్నత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సముద్ర తీరాల్లోని సమాచార వ్యవస్థను సురక్షితంగా ఉంచడం చాలా కీలకం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో చైనాలో ఆర్థిక, సైనిక రంగాలు పోటీ పడి వృద్ధి చెందడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అక్కడ వివిధ మిషన్‌లకు సహాయం చేసేందుకు అదనపు ప్రాంతీయ దళాలతో కూడిన 120 యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. ఇప్పటివరకు హిందూ సముద్ర ప్రాంతం చాలా వరకు శాంతియుతంగానే ఉంది.''
- జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతి
ఇదీ చూడండి: భారత్ దెబ్బను చైనా ఊహించలేదు: రావత్