భాజపా ప్రభుత్వం దేశాన్ని బ్రిటిష్ తరహాలో పాలిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. శనివారం లఖ్‌నవూలో జరిగిన 135వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ప్రియాంక.. స్వాతంత్య్ర సమరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం దేశం పోరాడుతోందన్నారు. దేశం ప్రమాదకర స్థితిలో ఉందని.. ఇప్పటికైనా ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు ప్రియాంక. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కాంగ్రెస్ దేశం పక్షాన పోరాడుతుందన్నారు.
"హింస ద్వారా భాజపా ప్రజల గళాన్ని అణిచివేయాలని చూస్తోంది. ఎన్ఆర్సీ గురించి ప్రస్తావించలేదని కేవలం ఎన్పీఆర్ గురించి మాట్లాడామని చెబుతున్నారు. ఈ దేశం మీరు చెప్పే అబద్ధాలను గుర్తించింది. ఈ దేశానికి కావాల్సింది మీ అబద్ధాలు కాదు...నిజం కావాలి. "
ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
భాజపా ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలను రూపొందిస్తోందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను వ్యతిరేకించేవారిని అణిచివేస్తున్నారని, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశంలో అనేక చోట్ల హింసను సృష్టించారని ధ్వజమెత్తారు. ఎంతోమందిని జైళ్లలో పెట్టి హింసిస్తున్నారన్నారు. భయంతో ఉన్న వ్యక్తి.. ప్రత్యర్థి నోరు మూయించేందుకు హింసను ఆశ్రయిస్తాడని ప్రియాంక అభిప్రాయపడ్డారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హింసాత్మక నిరసనల అనంతరం.. ప్రియాంక గాంధీ యూపీలో పర్యటించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ నిరసనల్లో 19 మంది మృతి చెందారు. పౌర ఆందోళనల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లాలని ప్రయత్నించిన ప్రియాంక, రాహుల్ గాంధీలను గత ఆదివారం మేరఠ్‌లో పోలీసులు అడ్డుకున్నారు.