బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సగానికిపైగా స్థానాల్లో భాజపా ఆధిక్యం కనబరుస్తోంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా... భాజపా ఖాతాలో ప్రస్తుతం 107 స్థానాలున్నాయి. ఈ ఉపఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిస్తే భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ ఖాతాలో ప్రస్తుతం 87 స్థానాలున్నాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్‌కు చాలా ముఖ్యం.
గుజరాత్...
గుజరాత్‌లో నవంబర్ 3న ఉపఎన్నిక జరిగిన 8 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. వీటీలో 2017లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు జూన్‌లో రాజ్యసభ ఎన్నికలకు ముందు భాజపాలోకి వచ్చి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక జరిగింది.
ఆయా రాష్ట్రాల్లో...
- ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 3న ఉపఎన్నిక జరిగిన ఏడు నియోజకవర్గాల్లో కౌంటింగ్ నడుస్తోంది.
- ఝార్ఖండ్‌లో నవంబర్ 3న ఉపఎన్నిక జరిగిన దుమ్కా, బెర్మో నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర బలగాల సాయంతో లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.
- ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి మరణంతో మార్వాహిలో నవంబర్ 3న జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది.
- హరియాణాలో నవంబర్ 3నే ఉపఎన్నిక జరిగిన బరోడా నియోజకవర్గంలో ఓట్లలెక్కింపు సాగుతోంది. కౌంటింగ్ మొత్తం 20 రౌండ్లు ఉంటుంది.
- ఒడిశాలో రెండు స్థానాలకు గత వారం ఉపఎన్నికలు జరగ్గా.. వాటి కౌంటింగ్ కొనసాగుతోంది.
- నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. నవంబర్ 3న దక్షిణ అంగామితో పాటు పుంగ్రో-ఖిప్రే స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
- మణిపుర్‌లో ఉపఎన్నిక జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కొవిడ్ మార్గదర్శకాలు అనుసరిస్తూ ఓట్లను లెక్కిస్తున్నారు.
- కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు కొనసాగుతోంది.