జనం సామూహికంగా గుమికూడే ప్రదేశాలకు, ఎక్కువమంది హాజరయ్యే కార్యక్రమాలు, సమావేశాలకు సాధ్యమైన మేరకు వెళ్లకపోవడం, తగిన దూరాన్ని పాటించడం సోషల్ డిస్టెన్సింగ్ ఉద్దేశం. అయితే ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్‌కు, క్వారెంటైన్, ఐసొలేషన్‌లకు తేడా ఉంది. ఒక నిర్దిష్ట ప్రదేశం, జోన్‌లో మాత్రమే వైరస్ ఇతరులకు సోకకుండా, వ్యాపించకుండా రోగుల్ని నియంత్రించడం క్వారెంటైన్, ఐసొలేషన్‌ల ఉద్దేశం. కానీ సోషల్ డిస్టెన్సింగ్‌లో ఇలాంటి ప్రాదేశిక నియంత్రణలేమీ ఉండవు. ముప్పును నివారించడానికి వ్యక్తులు తమకు తాము ప్రవర్తనను మార్చుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఏమేం చేయాలి?
ప్రయాణాలు తగ్గించండి
ప్రయాణాల వల్లే వైరస్ అత్యధికంగా వ్యాపిస్తోంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప విమానం, రైలు, బస్సు ప్రయాణాలు చేయొద్దు. భారత్‌లో రద్దీ వేళల్లో రైళ్లు, బస్సులు కిక్కిరిసి వెళుతుంటాయి. అవసరం అనుకున్నప్పుడు- రద్దీ లేని సమయాల్లోనే ప్రయాణించడానికి ప్రయత్నించండి.
రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దు
ఎక్కువమంది పోగయ్యే పాఠశాలలు, పబ్‌లు, థియేటర్లు, బహిరంగ మార్కెట్లు, ప్రార్థనాస్థలాలు, ఈత కొలనులు, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లకపోవడం మంచిది. 10 కన్నా ఎక్కువమంది పోగయ్యే గ్రూపుల్లో కలవకపోవడమే మంచిది.
ఇళ్లలోనే గడపండి
వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉండడం కోసం బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే గడపడం మేలు. ఇంటి నుంచే పనిచేయడానికి ప్రాధాన్యమివ్వండి. దానివల్ల సమూహాల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించొచ్చు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వారికి దూరంగా గడపాలి.
మనుషులకు మరీ దగ్గరగా ఉండొద్దు
మనిషి దగ్గినపుడు, తుమ్మినపుడు కనీసం 6 అడుగుల దూరం వరకూ తుంపర్లు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తికి మరీ దగ్గరగా వెళ్లకుండా ఆరడుగుల దూరం పాటిస్తే మేలు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇవి చేయక తప్పదు.
కరచాలనాలు వద్దు
కరచాలనం ద్వారా ఆత్మీయతను చాటొచ్చునేమో కానీ దానివల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దానికి బదులుగా నమస్కారం పెట్టడం, గాల్లో చేయి ఊపడం, పాదాలను తాకించుకోవడం, కనుబొమలు ఎగరేయడం లాంటివి చేయొచ్చునని సూచిస్తున్నారు.
వస్తువులకు దూరంగా ఉండండి
ఎక్కువమంది వాడిన పెన్నుల్లాంటి వాటిని ముట్టుకోకుండా ఉంటే మేలు. అలాగే తలుపు గొళ్లాలు, పుష్‌బటన్లు లాంటి వాటిని నేరుగా కాకుండా కాగితపు చేతి రుమాళ్లతో ముట్టుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు. వైరస్ సోకిన వ్యక్తులు వాడిన గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, పేపర్లు, తువ్వాళ్లు, మంచం, దుప్పట్లను కుటుంబ సభ్యులు వాడకుండా చూసుకోవాలి.
రద్దీ ఉన్న చోట్ల కూర్చోవద్దు
హోటల్, బార్, పబ్‌లాంటి చోట్లకు వెళ్లినపుడు జనం ఎక్కువగా పోగైన చోట కాకుండా ఖాళీ జాగాల్లో కూర్చోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే రద్దీ సమయాల్లో దుకాణాలు, మాల్స్‌కు వెళ్లకపోవడం మంచిది.