ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం వుహాన్ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనమైంది. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో.. 324 మంది భారతీయ పౌరులను చైనా నుంచి భారత్కు తీసుకొస్తోంది.
"ప్రత్యేక విమానం వుహాన్ నుంచి దిల్లీకి 324 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఇది దిల్లీకి చేరుకోవచ్చు." - ఎయిర్ ఇండియా ప్రతినిధి
రెస్క్యూ ఆపరేషన్
ఈ విమానంలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు. ఎయిర్ రెస్క్యూ డైరెక్టర్ (ఆపరేషన్స్) కెప్టెన్ అమితాబ్సింగ్ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు.
ఈ విమానంలో ఐదుగురు కాక్పిట్ సిబ్బంది, 15 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. అయితే వీరు ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందించరని, కనీసం మాట్లాడడం కూడా జరగదని ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రయాణికులకు కావాల్సిన ఆహారం వారి సీట్ల వద్దే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సిబ్బందికి, ప్రయాణుకుల కోసం మాస్కులు ఏర్పాటుచేశామని, ఇది వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోసం తీసుకున్న ముందు జాగ్రత్త మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
చైనాలో ఇప్పటి వరకు కరోనా ధాటికి సుమారు 258 మంది మరణించారు. మరో 9,692 మందికి వైరస్ సోకింది. అయితే మృతుల్లో భారతీయులు ఎవరూ లేరు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు.
మరో విమానం కూడా
ప్రస్తుతం దిల్లీ వస్తున్న విమానమే కాకుండా.. మరో ప్రత్యేక విమానాన్ని కూడా వుహాన్కు పంపించే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియా ఇంతకు ముందు కూడా లిబియా, ఇరాక్, యెమెన్, కువైట్, నేపాల్ వంటి దేశాల నుంచి ఇలాంటి రెస్క్యూ విమానాలను నడిపింది.
ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం సైన్యం, ఐటీబీపీ వైద్య శిబిరాలు