భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 83 మందికి ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 17 మంది విదేశీయులున్నారు. మహారాష్ట్రలో మరో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. తద్వారా ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19కి చేరినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు ఇటీవల దుబాయ్ నుంచి వచ్చారు. పుణెలో 10కేసులు నమోదు కాగా.. ముంబయి, నాగ్‌పుర్‌లో 3 కేసులు గుర్తించారు అధికారులు. ఇక ఠాణేలో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారు.
థియేటర్లు, పబ్లిక్ పార్కులు బంద్...
కరోనా వ్యాప్తి భయంతో మహారాష్ట్రలో పాఠశాలలు, సినిమా థియేటర్లు, వ్యాయామ శాలలు, స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ పార్కులను మూసేశారు. రాజస్థాన్‌లోనూ ఈ తరహా నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.
కరోనా వైరస్ అనుమానితుల పరార్...
నాగ్‌పుర్‌లోని మాయో ఆసుపత్రిలో ఐదుగురు కరోనా వైరస్ అనుమానితులు ఐసోలేషన్ వార్డు నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరికి వైరస్ పరీక్షల్లో నెగిటివ్ రాగా.. నలుగురి రిపోర్డులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో ముగ్గురు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ సమావేశం వాయిదా
ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ కార్యదర్శి సురేష్ భయ్యాజి జోషి తెలిపారు. మార్చి 15 నుంచి 17 వరకు జరగాల్సిన ఈ సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
ఆఫీసు తరలింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ.. తమ శాటిలైట్ ఆఫీస్ బిల్డింగ్‌లలో ఒకదానిని ఖాళీ చేయించింది. సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకిన వ్యక్తిని కలిశాడనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది.
పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా...
దిల్లీలో ఇప్పటివరకు ఏడుగురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్‌లో ముగ్గురికి కరోనా సోకింది.
రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. కేరళలో 19 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.