ఎవరి జీవితంలోనైనా వివాహమనేది ఓ అపురూప ఘట్టం. ఒక్కసారి నిశ్చితార్థం జరిగాక.. పెళ్లి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వధూవరులిద్దరూ వేచి చూస్తారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు అధికారి సంజయ్ జీవితంలోనూ ఆ మధుర క్షణం రానేవచ్చింది. ఊరంతా ఆహ్వాన పత్రికలు పంచేశారు. కల్యాణం కోసం కొన్ని రోజులు సెలవులూ ముందుగానే తీసుకున్నారు. కానీ, తేదీ దగ్గరపడగానే తానే పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
గరియాబాద్‌లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ ధృవ్‌కు.. శనివారం దుర్గ్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ... కరోనా కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ సక్రమంగా కొనసాగేలా విధులు నిర్వహిస్తున్న సంజయ్.. ప్రభుత్వ సూచనలు పాటించడం తన బాధ్యతగా భావించారు. వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.
"ఈ రోజు నా పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, ఈ రోజంతా పోలీస్‌స్టేషన్‌లోనే గడిచింది. ఓ కేసు విషయంలో నేను బిజీగా గడిపేశాను. నాకు అసలు నా పెళ్లి అని గుర్తు కూడా రాలేదు. నాకు నా కుటుంబం కూడా పూర్తి మద్దతిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మా ఇరుకుటుంబాలు పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాయి."
-సంజయ్ ధృవ్, పోలీస్