కరోనా వైరస్‌కు, కాలుష్య కారకాలకు మధ్య బంధం ఏర్పడిందా?... వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల మహమ్మారి ఉద్ధృతి ఎక్కువవుతోందా?.. అవుననే అంటోంది ఓ తాజా అధ్యయనం. ఇటలీలోని బోలోగ్న యూనివర్సిటీ, ట్రియస్టె యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
లంబార్డీలోని బెర్గామో పారిశ్రామిక ప్రాంతం నుంచి మూడు వారాల వ్యవధిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం10)కు సంబంధించి 30 నమూనాలను సేకరించి క్షుణ్నంగా పరిశీలించారు. చాలా నమూనాల్లో కరోనా వైరస్ జన్యు ఆనవాళ్లు కనిపించాయి. స్థిరమైన వాతావరణ పరిస్థితుల్లో భారీ స్థాయిలో ఉండే ధూళి కణాలకు కరోనా వైరస్ గుత్తులుగా అతుక్కునే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. లంబార్డీ ప్రాంతంలోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు కావడం, ఇదే ప్రాంతంలో గాలిలో సూక్ష్మ ధూళికణాలు(పీఎం10) ఎక్కువగా ఉండటం గమనార్హం. ధూళికణాల్లో కలిసిన వైరస్ మనుషులకు సోకితే ఆరోగ్యపరంగా సంభవించే దుష్ప్రభావాల తీవ్రతపై పరిశోధకులు ఒక అంచనాకు రాలేదు.
దిల్లీలో..
లంబార్డీని పోలిన పరిస్థితులే మన దేశ రాజధాని దిల్లీలోనూ ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచంలోని చాలా నగరాలకంటే దిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువ. సూక్ష్మ ధూళికణాలు(పీఎం10) ప్రమాదకర స్థాయిలో ఉంటాయిక్కడ. 2017లో వాయు కాలుష్య తీవ్రత కారణంగా దిల్లీలో 8 మరణాలు సంభవించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) 2018 డిసెంబరులో వెలువరించిన ఓ నివేదిక పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఊపిరి ఆడనివ్వని వాయు కాలుష్య పరిస్థితుల్లో కరోనా నుంచి బాధితులు కోలుకోవడమూ కష్టతరమవుతుందని మన దేశానికి చెందిన వాతావరణ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.