కేంద్రం అనుసరించిన వ్యూహాలతో దేశంలో కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకోగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వైరస్ కట్టడిలో చాలా వరకు విజయం సాధించామని కొవిడ్ అత్యున్నత కమిటీ సభ్యుడు సీకే మిశ్రా స్పష్టం చేశారు.
"దేశంలో కేసుల పెరుగుదల భారీగా లేదు. గడిచిన 30 రోజుల లాక్డౌన్ కాలంలో వైరస్ను సమర్థంగా కట్టడి చేశాం. పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నిచ్చాయి. సవాలుతో పాటే వ్యూహాం కూడా మారుతుంది. భారత్ ఇప్పటివరకు చేసింది అదే. మార్చి 23 నాటికి దేశంలో 400 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5 లక్షల పరీక్షలు చేస్తే 20 వేల కేసులు పాజిటివ్ వచ్చాయి. 14 రోజులుగా 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో 20 శాతం మంది కోలుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే చాలా బాగా కట్టడి చేశామని అర్థమవుతుంది."
-సీకే మిశ్రా
ఒక్క రోజులో 1,409 కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 1,409 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,393కు చేరిందని తెలిపారు. కరోనా ధాటికి 681 మంది మరణించారని పేర్కొన్నారు.
వీరిలో 4,257 మంది పూర్తిగా కోలుకున్నట్లు అగర్వాల్ స్పష్టం చేశారు. రోజుకు సగటున 388 మంది కోలుకున్నట్లు చెప్పారు. దేశంలో రికవరీ రేటు 19.89 శాతంగా ఉందని తెలిపారు.
మరిన్ని సడలింపులు..
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులను కేంద్రం సవరించింది. హాట్స్పాట్యేతర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాత్సవ వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లో విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ప్రీపెయిడ్ మొబైల్ ఛార్జింగ్ సేవలతో పాటు రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ అమ్మకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారుల్ని నియమించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక సాయం చేయకుంటే.. కరోనాపై విజయమెలా?'