రాజస్థాన్‌లో తొలిసారిగా కరోనా సోకిన హిమాన్షు ఉత్తమ్‌చందాని(37) అనే వ్యక్తి కోలుకున్నాడు. కానీ ఆయన ద్వారా అతడి చిన్నాన్న మోహన్‌కు సంక్రమించిన ఈ మహమ్మారి మాత్రం ప్రాణం తీసేదాకా వదల్లేదు. జోద్‌పూర్‌కు చెందిన హిమాన్షు.. తన కుటుంబంతో కలిసి మార్చి రెండోవారంలో టర్కీలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. మార్చి 18న తిరిగి ఆయన కుటుంబం భారత్‌కు తిరిగివచ్చింది. అతని చిన్నాన్న మోహన్, పిన్ని స్పెయిన్‌కు వెళ్లిపోయారు. విమానాశ్రయంలో పరీక్షల అనంతరం హిమాన్షు, ఆయన కుటుంబం జోద్‌పూర్‌కు వచ్చేశారు. మూడురోజుల అనంతరం గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్లిన హిమాన్షు పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా అతడికి చికిత్సను అందిస్తూ... కుటుంబాన్ని జోధ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. చికిత్సానంతరం అయన ఏప్రిల్ 6న డిశ్చార్జి అయ్యారు.
అదే కారణమా?
అయితే హిమాన్షు చిన్నాన్న మోహన్‌కు స్పెయిన్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించలేదు. 4-5 రోజుల అనంతరం ఆయనకు అనారోగ్య లక్షణాలు కనిపించడం వల్ల వైద్యుడిని పిలిపించారు. మోహన్‌ను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని సోదరుడు శంకర్ తెలిపారు. మోహన్ ఆరోగ్యం క్షీణించినందున మార్చి 31న ఆసుపత్రిలో చేర్పించామని.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 6న మరణించినట్లు చెప్పారు. స్పెయిన్‌లో తాజా పరిస్థితుల్లో అంత్యక్రియలకు నెలరోజుల సమయం పడుతుందని వాపోయారు.
ఇదీ చదవండి: 'కరోనాను నియంత్రించగలమనే ధైర్యం వచ్చింది'