కరోనా వైరస్ దేశంలో క్రమంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 68మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2650 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తంగా 2902మంది వైరస్ బారినపడ్డారు.
రాజస్థాన్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. బికనీర్ పట్టణంలో ఓ 60 ఏళ్ల వద్ధురాలు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలో తాజాగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కొవిడ్-19 సోకిన వారి సంఖ్య రాజస్థాన్‌లో 191కి చేరింది.
"కరోనా లక్షణాలతో నాలుగురోజుల కిందట వృద్ధురాలు ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి నేడు ప్రాణాలు కోల్పోయింది. ఆమె విదేశాలకు ఎటువంటి ప్రయాణాలు చేయలేదు."
-రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటన
యూపీలో మరో నలుగురికి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఆరుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. దిల్లీ తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్న 22 మంది వైరస్ అనుమానితుల రక్త నమూనాలను పరీక్షల కోసం పంపగా నలుగురికి వైరస్ సోకినట్లు తేలిందని.. మరో ఎనిమిదిమంది ఫలితాలు రావాల్సి ఉందని సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వారిని అలీగఢ్‌లో ఏర్పాటుచేసిన నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు తెలిపింది. తాజాగా వైరస్ సోకిన నలుగురితో బాధితుల సంఖ్య 209కు చేరింది.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలో మరో వ్యక్తి వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో మొత్తంగా తొమ్మిది మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 155కు చేరింది. రాజధాని నగరం భోపాల్‌లోనూ తొలి కరోనా కేసు నమోదైంది. ఓ మహిళకు మహమ్మారి సోకినట్లుగా వైద్యులు నిర్ధరించారు. వైరస్ ఉందన్న అనుమానంతో ఆమె తండ్రికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి: కరోనా వల్ల ఫోన్లోనే నిఖా కుబుల్ హోగయా!