దేశంలో విజృంభిస్తున్న కరోనా అనే 'అసురుడి'ని ఒక్క భగవంతుడే అంతం చేయగలడని అఖిల భారత అర్చకుల సంస్థ పేర్కొంది. అందుకు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు పునఃప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది.
పూజారులకు ప్రత్యేక ప్యాకేజీ...
ఆలయాలను మూసేయడం వల్ల.. పూజారుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని అఖిల భారత తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ పాథక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు తెరవడం వల్ల వారికి చేయూతగా ఉంటుందని పేర్కొన్నారు. పూజారులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల కొన్ని ఆంక్షలతో దేవాలయాలను తెరిచేలా అనుమతించాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
దేశంపై భగవంతుడు ఆగ్రహం...
ఆలయాలను కర్మాగారాలతో సమానంగా భావించి మూసేయడం వల్ల దేశం.. దేవతల ఆగ్రహానికి గురవుతోందని పాథక్ వెల్లడించారు. అంతే కాకుండా భక్తులు, దేవతల మధ్య దూరం పెరిగేలా చేసినట్లైందని, ఇంట్లో చేసే పూజల ద్వారా ఇరువురి మధ్య అనుసంధానం కలగదని వివరించారు.
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ ఆలయాలు తెరిచినప్పటికీ, భక్తులకు ప్రవేశం కల్పించట్లేదు. బాధతో, అలజడితో నిండిన మనసుకు దేవతలు ఓదార్పునిస్తారు. అక్కడ భక్తులను అనుమతించాలి.
మహేష్ పాథక్, అఖిల భారత తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు
ఈ లేఖను హోం మంత్రి అమిత్‌షాకూ పంపినట్లు పాథక్ తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, కర్మాగారాలతో పాటు, దేవాలయాలనూ మూసేసింది ప్రభుత్వం.
దేశంలో ఇప్పటివరకు 85 వేలకు పైగా కొవిడ్ బారిన పడ్డారు. 2,752 మంది వైరస్‌కు బలయ్యారు.