'నేనే వికాస్ దూబే, కాన్పుర్ వాలా' అంటూ పోలీసుల ముందు రంకెలేసిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ' 8 మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుంది, అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాం' అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్లు సమాచారం. విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసుల నుంచి దూబేను తమ అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు రోడ్డు మార్గాన లఖ్‌నవూకు తరలిస్తున్నారు.
పోలీసులే ఉప్పందించారు..?
తనను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం వస్తోన్న సమాచారం స్థానిక చౌబేపూర్ పోలీసుల నుంచే వచ్చినట్లు వికాస్ దూబే విచారణలో తెలిపినట్లు సమాచారం. అయితే, మరుసటి రోజు ఉదయం వస్తారనే సమాచారం ఉందని, కానీ, పోలీసులు రాత్రే రావడం వల్ల భయంతో వారిపై కాల్పులు జరిపినట్లు విచారణలో వివరించాడు. అంతేకాకుండా, స్థానిక పోలీసులందరికీ ఎన్నో విధాలుగా సాయం చేశానని, దాదాపు వారందరినీ నేనే పోషించానని తెలపడం గమనార్హం. చౌబేపూర్ పోలీసులతోపాటు మరికొన్ని స్టేషన్ల సిబ్బందికి ఎంతో సాయం చేసినట్లు దూబే విచారణలో వెల్లడించాడని సమాచారం.
వీఐపీ పాస్‌తో ఆలయంలోకి..!
8 మంది పోలీసులను హతమార్చిన అనంతరం చిక్కకుండా ఐదురోజులు తప్పించుకుతిరిగిన వికాస్ దూబే ఉజ్జయిన్‌లోని మహంకాళి ఆలయం వద్ద పట్టుబడ్డాడు. అయితే, ఏకంగా వీఐపీ పాస్‌తో ఆలయంలో దర్శనం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మరోసారి విస్తుపోయిన పోలీసులు అతనికి సహకరించిన వారి కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం డీలర్‌తోపాటు మరికొందరు నాయకులు కూడా అతనికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు.
దూబే తల్లి ఆవేదన..
కాన్పుర్ ఎన్‌కౌంటర్ అనంతరం 'నా కొడుకుని కాల్చి చంపండి' అంటూ అతని తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా అరెస్టు విషయాన్ని విలేకరులు ఆమెదగ్గర ప్రస్తావించగా 'నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏది సరైనదో ప్రభుత్వం అదే చేస్తుంది' అని స్పందించారు. ఇక అరెస్టు వార్త విన్న వెంటనే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన పోలీసు కుటుంబాలు స్పందించాయి. ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కిరాతకున్ని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు ఎన్ఐఏకు బదిలీ