ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో శ్మశానం పైకప్పు కూలి 24 మంది మరణించిన ఘటనలో ముగ్గురు మున్సిపల్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మురాద్‌నగర్ నగర పాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి నిహారిక సింగ్, జూనియర్ ఇంజినీర్ చంద్రపాల్, సూపర్వైజర్ ఆశిశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గాజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. కాంట్రాక్టర్ అజయ్ త్యాగి కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించినట్లు స్పష్టం చేశారు.
బాధితుల నిరసన
ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దిల్లీ-మేరఠ్ రహదారిని దిగ్బంధించారు. నష్టపరిహారం పెంచాలని, మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి.
ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు.