సరిహద్దులు దాటి మనదేశంలోకి చొచ్చుకొనివచ్చిన చైనా పేరు ప్రస్తావించడానికి అధికారంలో ఉన్న వ్యక్తులు ఎందుకు జంకుతున్నారని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా చైనా, పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకు భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేసిన వారికి భారత సైనికులు గట్టి సమాధానం ఇచ్చారని జవాన్ల ధీరత్వాన్ని ప్రశంసించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ ఈ విమర్శలు చేసింది.
'130 కోట్ల మంది భారతీయులు.. మన సైనికుల పట్ల గర్వంగా, విశ్వాసంతో ఉన్నారు. చైనా మన దేశం మీదకు దాడికి దిగిన ప్రతిసారి తిప్పికొట్టే సైనికులకు సెల్యూట్ చేస్తున్నాం. కానీ, అధికారంలో ఉన్నవారి మాటేంటి? చైనా పేరు ప్రస్తావించాలంటే వారెందుకు జంకుతున్నారు? చైనా భారత భూభాగంలోకి ప్రవేశించిన సమయంలో.. ఆ దురాక్రమణను తిప్పి కొట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రతి భారతీయుడు అడగాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వానికి ఈ ప్రశ్న వేయాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం' అని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం మీద విశ్వాసం ఉందా అంటూ విమర్శలు చేశారు. 'ఆత్మనిర్భర్ భారత్కి' పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు పునాది వేశారని చెప్పుకొచ్చారు. అలాగే రైల్వే, విమానాశ్రయాలు, ఎల్‌ఐసీ నుంచి ఎఫ్‌సీఐ వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మీద దాడి చేసే ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని స్వేచ్ఛగా ఉండనిస్తుందా? అని మండిపడ్డారు.