కర్ణాటకలో అప్పుతీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేయడం మరువక ముందే పంజాబ్ ముక్త్సర్లో శుక్రవారం మరో అమానుష ఘటన జరిగింది. రూ.23వేల బాకీ కట్టలేదని మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సోదరుడు. అనుచరులతో కలిసి ఆమెను ఇంట్లోనుంచి నడిరోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. బెల్టుతో కొట్టాడు. మిగిలిన వారు కర్రలతో ఆమెను ఇష్టమొచ్చినట్టు హింసించారు. స్పృహ కోల్పోయే వరకు దాడి చేశారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన మరో మహిళనూ కొట్టారు.
తీవ్రగాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ సోదురుడు సురేశ్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
ఇలాంటి అమానుష దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని ఎస్ఎస్పీ మంజిత్ ధేసి తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ఖండన
మహిళపై దాడిని తీవ్రంగా ఖండించారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించేది లేదని ట్వీట్ చేశారు.
"ముక్త్సర్లో దాడి వీడియోలో ఉన్న నిందితులను అరెస్టు చేశాం. సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశాం. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు. ఇలాంటి అమానుష దాడులను సహించబోము."
-అమరీందర్ సింగ్ ట్వీట్.
ఇదీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై అమానుషం