కర్ణాటక బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు దుండగులు. ఇంటికి నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్యే మేనల్లుడు ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు తమ మనోభావాలను కించపరిచేలా ఉందని ఓ వర్గం ఆందోళనకారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అనంతరం కేజీ హల్లి, డీజే హల్లి పోలీస్ స్టేషన్లకు గుంపులుగా వెళ్లి.. ఎమ్మెల్యే బందువును అరెస్టు చేయాలని మతపరమైన నినాదాలు చేశారు. పలు వాహనాలకు నిప్పుపెట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.
ఘర్షణ...
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై నిరసనకారులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా గాయపడ్డారు.
ఈ ఘర్షణలో ఏసీపీ సహా దాదాపు 100 మంది పోలీసులు గాయపడినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అల్లర్లతో సంబంధమున్న 110 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. బెంగళూరులో 144 సెక్షన్, కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.
విజ్ఞప్తి చేసినా..
బెంగళూరులోని పులికేసి నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీనివాస మూర్తి. హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని ఆందోళనకారులను ఫేస్బుక్లో వీడియో ద్వారా ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.
విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.