కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని 15 కీలక హామీలు మీకోసం సంక్షిప్తంగా...
1. పేదరిక నిర్మూలనకు 'న్యాయ్'
పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.72వేల చొప్పున జీవన భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ. న్యూన్‌తమ్ ఆయ్ యోజన పేరుతో అమలు. మహిళల బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ.
2. యువత కోసం ఉద్యోగ విప్లవం
కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యం... దేశంలోని యవతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పన. వచ్చే ఐదేళ్లలో 34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో కల్పిస్తామని వాగ్దానం చేశారు.
34లక్షల ఉద్యోగాల భర్తీ ఇలా...
⦁ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 2020 మార్చి నాటికి 4లక్షల ఉద్యోగాల భర్తీ.
⦁ 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేయడం.
⦁ ప్రతి గ్రామ పంచాయితీ, పట్టణాభివృద్ధి సంస్థల్లో సేవామిత్ర ఉద్యోగాల ద్వారా 10లక్షల ఉద్యోగాల భర్తీ.
3. కిసాన్ బడ్జెట్
⦁ రైతులు, వ్యవసాయ కూలీలపై ప్రత్యేక దృష్టి.
⦁ రుణమాఫీతో సరిపెట్టకుండా రైతుల్ని రుణ విముక్తుల్ని చేయడమే అసలు లక్ష్యం.
⦁ రైతుకు పెట్టుబడి ధర తక్కువగా ఉండేందుకు చర్యలు
⦁ ఏటా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్- వ్యవసాయాభివృద్ధి కోసం శాశ్వత జాతీయ కమిషన్ ఏర్పాటు
4. యూనివర్సల్ హెల్త్‌కేర్
ఆరోగ్య సంరక్షణ హక్కు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వాసుపత్రుల్లోనే కాక, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, ఔట్ పేషంట్ సేవలు తీసుకొస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 2023-24 సంవత్సరం నాటికి ఆరోగ్య రంగానికి కేటాయింపులను జీడీపీలో 3 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది.
5. వస్తు సేవల పన్నులో సమూల మార్పులు
భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని సరళతరం చేస్తామని చెప్పింది కాంగ్రెస్. యుద్ధప్రాతిపతికన సమూల మార్పులు చేస్తామని తెలిపింది. పంచాయితీ, మున్సిపాలిటీలకు జీఎస్టీలో వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
6. రక్షణ రంగంపై మరింత ఖర్చు
గత ఐదేళ్లలో దేశ రక్షణపై ఖర్చు తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే రక్షణ దళాలకు అవసరమైన విధంగా కేటాయింపులు ఉంటాయని హామీ ఇచ్చింది. రక్షణ రంగ ఆధునికీకరణ అత్యంత పారదర్శకంగా చేస్తామని వాగ్దానం చేసింది. పారా మిలిటరీ దళాలకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యం మొదలైనవి మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది.
7. 7వ తరగతి వరకు తప్పనిసరి ఉచిత విద్య
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా విద్యావ్యవస్థ ప్రక్షాళనకు హామీ ఇచ్చింది కాంగ్రెస్. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఉచిత విద్య అమలు చేస్తామని వాగ్దానం చేసింది. 2023-24 నాటికి విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్.
8. మహిళలకు రిజర్వేషన్
⦁ పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పనకు చర్యలు
⦁ చట్టసభలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
⦁ 17వ లోక్‌సభ మొదటి సెషన్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు
9. ఆదివాసీల హక్కుల కోసం
2006లో అటవీ హక్కుల చట్టం పటిష్ఠంగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కలపయేతర అటవీ ఉత్పత్తుల కోసం జాతీయ కమిషన్‌ను రూపొందించి ఆదివాసీల జీవనాధారానికి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసింది.
10. గ్రామీణ భారతంలో సొంతిళ్లు లేని వారికి భూమి
గ్రామాల్లో సొంత ఇళ్లు లేని కుటుంబాలకు భూమి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.
11. మూకదాడులపై కఠిన చర్యలు
ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశవ్యాప్తంగా విద్వేషపూరిత అల్లర్లు, ఒక వర్గానికి చెందిన వారిపై అసంఖ్యాక దాడులు పెరిగాయని విమర్శించింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే మూక దాడులు, హత్యలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దురాగతాలు అంతమొందిస్తామని మేనిఫెస్టోలో చెప్పింది.
12. స్వేచ్ఛను కాపాడుతాం
భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ హక్కును కాపాడుతామని చెప్పింది కాంగ్రెస్. గోప్యతకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తామని వాగ్దానం చేసింది. ఆధార్ అనుసంధానాన్ని చట్టంలో ఉన్న అంశాలకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పింది.
ప్రజా హక్కులను కాలరాసే పాత చట్టాలను సమీక్షించి, పనికిరాని వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.
13. సంస్థలను కాపాడతాం
రిజర్వు బ్యాంక్, ఎన్నికల సంఘం, సీబీఐ లాంటి సంస్థలను గత ఐదేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించింది కాంగ్రెస్. వాటి ప్రతిష్ఠ, గౌరవాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది.
భాజపా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లను రద్దు చేసి, జాతీయ ఎన్నికల నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.
14. పట్టణాభివృద్ధికి ప్రత్యేక విధానం
నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం విస్తృతమైన పట్టణీకరణ విధానం అమలుకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.
15. స్వతంత్ర పర్యావరణ పరిరక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటు
పర్యావరణ పరిరక్షణకు, భూతాపం తగ్గించేందుకు కార్యాచరణను రూపొందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తామని వాగ్దానం చేసింది.