రాజస్థాన్‌లో రాజకీయ కలకలం మొదలైంది. తనను పీఠం నుంచి దించేందుకు భాజపా ప్రలోభాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి.
రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రలోభాలకు దిగారంటూ ఇద్దరు వ్యక్తులపై ప్రత్యేక ఆపరేషన్ల బృందం (ఎస్ఓజీ) పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో ఈ కలకలం రేగింది. వీరిని విచారించిన అనంతరం చర్యలకు ఉపక్రమించింది ఎస్ఓజీ. భాజపా తరపున కొందరు రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
వాంగ్మూలం కోసం..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వాంగ్మూలాలు ఇవ్వాలని సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌లకు ఎస్ఓజీ నోటీసు జారీ చేసింది. వీరికే కాకుండా ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషికి కూడా నోటీసు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు గహ్లోత్ నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.
రూ.25 కోట్లు ఇస్తామని..
రాజస్థాన్లోనూ మధ్యప్రదేశ్ తరహా రాజకీయ క్రీడలు ఆడాలని భాజపా కోరుకుంటోందని విమర్శించారు గహ్లోత్. కానీ ప్రజలంతా గమనిస్తున్నారని.. సరైన సమయంలో భాజపాకు గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
"భాజపా నేతలు సిగ్గులేని పరిమితిని ఎప్పుడో దాటేశారు. అది సతీష్ పూనియా కావచ్చు, రాజేంద్ర రాఠోడ్ కావచ్చు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆటలాడుతున్నారు. ముందుగా రూ. 10 కోట్లు, ప్రభుత్వం పడిపోయాక రూ. 15 కోట్లు అంటూ బేరాలు ఆడుతున్నారు. రాష్ట్రంలో 'మేకల సంత' రాజకీయాలు చేస్తున్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ మానవత్వాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వాన్ని కూలదోయడంలో నిమగ్నమయ్యారు."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు సీఎం. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భాజపా ఖండన..
అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది. ఇవి పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత కలహాలేనని తమ తప్పేమీ లేదని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్యాంగాంగ్ నుంచి వెనక్కు తగ్గిన చైనా బలగాలు!