సామాజిక మాధ్యమాల్లో భాజపాకు కౌంటర్ వేయడమే లక్ష్యంగా ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. 'జాయిన్‌కాంగ్రెస్ సోషల్ మీడియా' పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని తీసుకొచ్చింది. 5లక్షల మంది ఆన్‌లైన్ యోధులు ఉండాలనే లక్ష్యంతో.. దీన్ని ప్రారంభించినట్లు కాంగ్రెస్ తెలిపింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సల్, పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా.. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ ఉద్యమాన్ని రాహుల్ వివరించారు. ఆ 5 లక్షలమంది.. విద్వేషాన్ని ఎదుర్కొని.. దేశ ఆలోచనలను రక్షిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సత్యం, కరుణ, సామరస్యం కోసం దేశానికి అహింస యోధులు కావాలని రాహుల్ గాంధీ అన్నారు. దేశయువతకు దేశంలో ఏం జరుగుతుందో తెలుసనని అణచివేతను వారు చూస్తున్నారని పేర్కొన్నారు.దిల్లీ సరిహద్దుల్లో రైతులపై జరుగుతున్న యుద్ధానికి ట్రోల్‌ఆర్మీ వెన్నెముకగా నిలుస్తోందన్నారు. వేలాది మంది డబ్బులు తీసుకొని విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని రాహుల్ తెలిపారు. వారిని ఎదుర్కొనేందుకు మనకు ఆన్‌లైన్ వారియర్ల అవసరముందని రాహుల్ అన్నారు.
ఇదీ చూడండి:- 'యువత, రైతుల కన్నా వారే మీకు దేవుళ్లు'