కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్. ప్రస్తుతం వారి స్థానాల్లో ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) భేటీ అయ్యింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి సీనియర్ నాయకుడి నేతృత్వంలో బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను శుక్రవారం ప్రకటించనుంది పార్టీ.
"17 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చర్చించేందుకు భేటీ అయ్యాం. ప్రతిఒక్క నియోజకవర్గానికి సీనియర్ నాయకుడి అధ్యక్షతన బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం. వారు తక్షణమే వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు."
- దినేష్ గుండూరావు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
జేడీఎస్‌తో పొత్తు...
ఉప ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు కొనసాగుతుందా అనే ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కేపీసీసీ నేతలు. పార్టీ అధిష్ఠానం కూటమి అంశంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కానీ.. ఉప ఎన్నికల్లో సొంతంగానే పోటీచేయాలని పార్టీ నేతలు కోరుకుంటున్నట్లు సమాచారం.
'రెబల్స్'పై న్యాయపోరాటం
అనర్హతకు గురైన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గుండూరావు. ఫిరాయింపుల చట్టాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని పూర్తి నమ్మకం ఉందన్నారు. వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై మోదీతో ఫరూక్ భేటీ