పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన పీడనకు గురై మనదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. విపక్షాలు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లోక్‌సభలో దానికి ఆమోదముద్ర పడింది. అయితే, భారత నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) పౌరసత్వ సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పాక్ నిఘా సంస్థ తమ ఏజెంట్లను మనదేశంలోకి పంపించేందుకు ఈ బిల్లును ఉపయోగించుకునే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ముందు ఐబీ, రా ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
నిర్ధారణ కష్టమే
మతపరమైన హింసను కారణంగా చూపుతూ దశాబ్దాల క్రితమే పలువురు మనదేశంలోకి శరణార్థులుగా ప్రవేశించారు. వారు చూపిన కారణం వాస్తవమైనదేనా అనే సంగతిని ప్రస్తుతం నిర్ధారించుకోవడం కష్టమని కమిటీ ఎదుట ఐబీ పేర్కొంది. ఇటీవలి కాలంలోనే వచ్చినవారైతే మాత్రం.. ఆయా దేశాల్లో పరిస్థితుల తీవ్రతను మీడియా కథనాల ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పింది. శరణార్థుల దరఖాస్తులపై విదేశీయుల నమోదు కార్యాలయం ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తామంది. విదేశాల్లో మతపరమైన పీడనను కారణంగా చూపుతూ ఇప్పటివరకు 31,313 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.
లొసుగుగా మారే అవకాశం!
శత్రు దేశాల నిఘా సంస్థలు తమ ఏజెంట్లు, మద్దతుదారులను భారత్‌లోకి పంపించేందుకు పౌరసత్వ బిల్లును లొసుగుగా ఉపయోగించుకునే అవకాశముందని కమిటీ ముందు ‘రా’ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి పరిణామాలు దేశ భద్రతకు ప్రతికూలంగా మారే అవకాశముందని పేర్కొంది. పాక్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
- సంజీబ్ బారువా, ఈటీవీ భారత్ ప్రతినిధి