వచ్చే మూడేళ్లలో ఆర్మీ, నావికాదళం, ఎయిర్‌ఫోర్స్ కార్యకలాపాలను అనుసంధానించేలా కమాండ్ సెంట్లరను ప్రారంభిస్తామని భారత త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన త్రివిధ దళాధిపతులతో తొలిసారిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైనిక బలాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. సైనిక వ్యయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీటితో పాటు త్రివిధ దళాలన్నీ ఒకే యూనిట్ కింద పని చేసేలా భవిష్యత్‌లో నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ఆయన చెప్పారు.
దీనికోసం కొత్త కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు రావత్. అయితే ఇప్పటివరకు వాటి పేర్లు ఖరారు కానప్పటికీ.. పశ్చిమ థియేటర్ కమాండ్, లద్దాఖ్‌తోపాటు నేపాల్ సరిహద్దు పరిధిలో ఉత్తర థియేటర్ కమాండ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్ముకశ్మీర్ కోసం ప్రత్యేక కమాండ్, తూర్పు థియేటర్ కమాండ్‌ను ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ కమాండ్లన్నీ ఎవరి అధీనంలో పని చేస్తాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
భారత నౌకాదళం కోసం మూడో విమాన వాహక నౌక అవసరాన్ని గుర్తుచేశారు రావత్. ఇప్పటికే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య సేవలందిస్తుండగా.. ఐఎన్‌ఎస్ విక్రాంత్ త్వరలో భారత్ నౌకాదళంలో చేరనుంది. ఈ రెండింటికీ అదనంగా మరో విమానవాహక నౌక కావాలని ప్రభుత్వాన్ని కోరింది నేవీ. అంతేకాకుండా కొత్తగా అవసరమైన ఆధునియ యుద్ధవిమానాల అంశం కూడా భేటీలో చర్చకు వచ్చింది.