కోయంబత్తూరులో జరిగిన అత్యాచారం, జంట హత్యల కేసు దోషికి అక్టోబరు 16 వరకు ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుని... ఈమేరకు ఆదేశాలిచ్చింది.
దోషి మనోహరన్కు ఈనెల 20న మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది.
9 ఏళ్ల క్రితం మనోహరన్ ఓ బాలికను అత్యాచారం చేశాడు. ఆమెను, ఆమె సోదరుడ్ని హత్యచేశాడు. విచారణ న్యాయస్థానం మనోహరన్కు మరణశిక్ష విధించింది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజార్టీతో ఆ శిక్షను ఖరారు చేసింది.
అయితే... తీర్పును సమీక్షించాలంటూ దోషి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. విచారణ కోర్టులో ఉన్న రికార్డులను పరిశీలించాల్సి ఉందని, అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం... మరణశిక్ష అమలుపై అక్టోబర్ 16 వరకు స్టే విధించింది. ఇదే ఆఖరి అవకాశమని మనోహరన్ తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది.