మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు బలపరీక్ష నిర్వహించాలన్న ఆదేశాలపై గవర్నర్ లాల్జీ టాండన్‌ను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నిన్న రాజ్‌భవన్‌కు వెళ్లి కలిశారు.
తమ ప్రభుత్వానికి తగిన మెజారిటీ ఉందని.. బలపరీక్షను రద్దు చేయాలని కమల్‌నాథ్ కోరారు. ఒకవేళ బలపరీక్ష తప్పదని భావిస్తే ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ చేశారు.
"బడ్జెట్ సమావేశంలో భాగంగా సభను ఉద్దేశించి ప్రసంగించినందుకు గవర్నర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపాను. శాసనసభలో మాకు తగిన బలం ఉంది. బలపరీక్ష అవసరమే లేదు. ఎవరైతే మా ప్రభుత్వానికి మెజారిటీ లేదంటున్నారో.. వాళ్లు శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. బెంగళూరులో ఉన్న 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను తీసుకువచ్చి వాళ్లకు స్వేచ్ఛను కల్పించాలి."
-కమల్‌నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
కరోనా భయాందోళనల నేపథ్యంలో నిన్న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 26 వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఈ 10 రోజుల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. కొద్ది గంటల్లోనే గవర్నర్ లేఖతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఒకవేళ మంగళవారం బలపరీక్ష నిర్వహించకపోతే కమల్ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టుకు భాజపా ఎమ్మెల్యేలు..
సభను వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయించటం వల్ల భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో 10 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారమే బల నిరూపణ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సభా సమావేశాలను వాయిదా వేయడంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 గంటల్లోగా బల నిరూపణ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కూడా రక్షించలేదని ఈ సందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. మెజార్టీ లేదని తెలిసి సీఎం కమల్‌నాథ్ బల నిరూపణ పరీక్ష నుంచి పారిపోతున్నారని విమర్శించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా నేతలు గవర్నర్‌ను కలిశారు.
సింధియా రాజీనామాతో..
కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరగా.. ఆయన విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలూ ఆయన వెంట వెళ్లారు. ఫలితంగా కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆరుగురు మంత్రులతో కలిపి మొత్తం 22 మంది కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేయగా.. సభాపతి కేవలం మంత్రుల రాజీనామాలను మాత్రమే ఆమోదించారు.
సింధియా పార్టీ మారడానికి ముందు కాంగ్రెస్ బలం 114. భాజపా 107, ఎస్పీ 1, బీఎస్పీ 2, ఇతరులు 4గా ఉండేది. మొత్తం 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఆరుగురు మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయి. అందువల్ల ప్రస్తుత అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కి చేరింది. అసెంబ్లీలో కమల్‌నాథ్ సర్కార్ బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం 112 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. సంక్షోభం తలెత్తే సమయానికి బీఎస్పీ, ఎస్పీతో పాటు నలుగురు ఇతరులు ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు.