ప్రధాని నరేంద్ర మోదీకి సీజేఐ లేఖ రాశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను పదవి నుంచి తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందన్నారు సీజేఐ. అందువల్ల ఆయన్ను తొలగించే ప్రక్రియ చేపట్టాలని చీఫ్ జస్టిస్ కోరారు.
ద్విసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ శుక్లాపై ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు ఎప్పుడైతే సీజేఐ రాష్ట్రపతి లేదా ప్రధానికి లేఖ రాస్తారో ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ సంఘం ఏర్పాటవుతుంది.
రాజ్యసభ ఛైర్పర్సన్ సీజేఐని సంప్రదించి ఈ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆధారాలను పరిశీలించి ఆరోపణలు వచ్చిన న్యాయమూర్తి తొలగింపుపై రాజ్యసభలో చర్చ చేపట్టాలా వద్దా అని తేలుస్తుంది .
- ఇదీ చూడండి: దొంగతనం ఆరోపణలతో ఎయిరిండియా పైలట్‌పై వేటు