శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించే విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టులో 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. ఈనెల 13 నుంచి ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించనున్నారు. జస్టిస్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.ఎన్.రావు, జస్టిస్ శాంతన గౌదర్, జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారికి ఈ మేరకు నోటీసులు ఇచ్చింది ధర్మాసనం. 2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదీ చూడండి: 'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'