భారత్‌లో విహారయాత్రకు శీతాకాలం అనువైనది. కమ్ముకున్న మంచు తెరల్లో నుంచి ప్రకృతి అందాలను చూసి తరిస్తుంటారు పర్యటకులు. దేశంలోని పర్యటక ప్రేమికులే కాకుండా, విదేశాల నుంచి కూడా శీతాకాలంలో ఇక్కడి పర్యటక ప్రాంతాలను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు అసోం, సిక్కింతో పాటు బంగాల్ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న పౌర నిరసనలు దేశ పర్యటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
విదేశాలపై ఆసక్తి..
'పౌర' ఆందోళనల నేపథ్యంలో దేశ ప్రజలు కూడా తమ సెలవులను విదేశాల్లో గడపడానికే ఇష్టపడుతున్నారు. విదేశీయులు మాత్రం.. మీడియా కథనాల ఆధారంగా ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి ఏజెంట్లను సంప్రదిస్తున్నారు.
"గోవా, రాజస్థాన్‌తోపాటు దక్షిణ భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించాలనుకున్న చాలా మంది దేశీయ పర్యటకులు దుబాయ్, దక్షిణాసియా దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా, కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా నుంచి పర్యటకులు భారత్‌లోని పరిస్థితులు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సమాచారాన్ని తెలుకునేందుకు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ నిరసనలు కొనసాగితే ముందు ముందు చాలా కష్టం."
- జ్యోతి మాయల్, భారత ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు.
నిరసనల దృష్ట్యా భారత్‌లో పర్యటించాలంటే ఎంతో జాగ్రత్త వహించాలని అనేక దేశాలు తమ పౌరులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇది కూడా దేశ పర్యటక రంగంపై ప్రభావం చూపుతోంది.
డేటా ప్రకారం 2019 అర్ధభాగంలో 52.66 లక్షల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. 2018తో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. అయితే... రెండో అర్ధభాగంలో ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీ, పౌరసత్వ చట్ట సవరణ వంటి వివాదాస్పద అంశాలతో పర్యటకుల సంఖ్య భారీగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు.