తూర్పు లద్దాక్‌లో చెలరేగిన సరిహద్దు వివాదాన్ని భారత్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ప్రతిపాదించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్లో మాట్లాడిన వాంగ్ యీ... వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు విభేదాలు పక్కన పెట్టాలని, సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు కుదిరిన ఒప్పందాలను ఇరుదేశాలు పరస్పరం గౌరవించాలని పునరుద్ఘాటించారు వాంగ్.
ప్రణాళిక ప్రకారమే చేశారు..
గాల్వన్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందని జైశంకర్ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు చైనా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
సైనికులను అదుపులో ఉంచండి..
అయితే భారత సైనికులే హద్దు మీరారని, అందువల్ల వారిని అదుపులో ఉంచి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వాంగ్ యీ కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది.
న్యాయంగా వ్యవహరిద్దాం..
సరిహద్దు సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపనకు కృషి చేయాలని నిర్ణయించాయి.
ఇరువైపులా భారీ ప్రాణనష్టం
గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భారత్ వైపు 20 మంది సైనికులు వీర మరణం పొందగా, సుమారు 43 మంది చైనా జవానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: 'మోదీజీ... సరిహద్దు ఘర్షణపై మౌనం వీడండి'