మధ్యాహ్నం భోజన పథకం అమలులో ఓ పాఠశాల నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోతారు. ఉత్తర్‌ప్రదేశ్ సోన్‌భద్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కలిపి లీటరు పాలు ఇచ్చారు.
పాలు అందుబాటులో లేవంటూ.. లీటరు పాలల్లో ఏకంగా బకెట్ నీళ్లు కలిపి వేడి చేశారు. వాటిని పిల్లలతో తాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా... ఈ విషయం జిల్లా అధికారుల దృష్టిలో పడింది. సోన్‌భద్ర ప్రాథమిక శిక్షా అధికారి గోరఖ్‌నాథ్ పటేల్ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
"పాలు అందుబాటులో లేవని నాకు చెబుతున్నారు. అందువల్ల నీటిని సమతుల్య పరిమాణంలో కలపాలని వారికి అధికారులు ఆదేశించారట. ఉపాధ్యాయులు మరిన్ని పాలు తీసుకురావడానికి వెళ్లారని నాకు చెప్పారు. ఆ లోపు సమయంలో ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం."
-గోరఖ్‌నాథ్ పటేల్, ప్రాథమిక శిక్షా అధికారి
గతంలోనూ...
ఇదే తరహాలో మీర్జాపుర్‌లో గత ఆగస్టులో ఓ వీడియో వైరల్ అయింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పుతో పిల్లలకు వడ్డించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిపై అప్పుడు కేసు నమోదు చేశారు.