20 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా గత నెల ముంబయి పోలీసులకు చిక్కాడు. లక్డావాలాను విచారించగా కొన్ని కీలక నిజాలు బయటపెట్టాడు. 1998లో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను చంపేందుకు ప్రయత్నించింది చోటా రాజన్ గ్యాంగేనని , అందులో తానూ భాగస్వాముడినేనని ఒప్పుకున్నాడు లక్డావాలా.
దర్గా వద్ద మకాం..
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు అనుచరుడిగా పనిచేశాడు లక్డావాలా. అయితే కొన్నేళ్ల తరువాత వ్యక్తిగత విబేధాలతో దావూద్ శత్రువైన చోటా రాజన్ గ్యాంగ్‌లో చేరాడు. 1998లో చోటా రాజన్ సన్నిహితులు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషా, బాలు డోక్రే, వినోద్ మాత్కర్, సంజయ్ ఘాటే, బాబారెడ్డి దావూద్ హత్యకు పథకం వేశారు. ఈ ముఠాలో లక్డావాలా కూడా ఉన్నాడు.
తన కూతురు మృతి చెందినప్పుడు ప్రార్థనలు చేసేందుకు పాకిస్థాన్ కరాచీలోని ఓ దర్గాకు దావూద్ రాబోతున్నాడని తెలుసుకున్న విక్కీ ముఠా.. ఎలాగైనా దావూద్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో పథకం విఫలమైందని చెప్పాడు లక్డావాలా.
"విక్కీ మల్హోత్రా బృందం దావూద్‌ను చంపేందుకు వారు కోసం దర్గా దగ్గర మకాం వేశారు. ఆ రోజు ఓ నేపాల్ పార్లమెంట్ సభ్యుడు వారి పథకంపై సమాచారం ఇవ్వడం వల్ల భారీ భద్రతతో దర్గాకు వచ్చాడు దావూద్. దీంతో వారు ఆ రోజు వేసిన పథకం విఫలమైంది. అప్పుడు దావూద్‌కు ఈ విషయం తెలిసిపోయి ఉంటుందని చోటారాజన్ తన అనుచరులను అక్కడి నుంచి పంపించేశాడు."
-పోలీస్ అధికారి
"చోటారాజన్ పథకం గురించి తెలుసుకున్న పాకిస్థాన్ పోలీసులు విక్కీ మల్హోత్రా బృంద సభ్యుల ఇళ్లను సోదా చేశారు. దావూద్‌ను హతమార్చేందుకు సమకూర్చిన ఆయుధాలను తీసుకెళ్లారు" అని చెప్పుకొచ్చాడు లక్డావాలా.
లక్డావాలాపై దాడి..
చోటా రాజన్ బృందం దావూద్‌ను చంపేందుకు విఫలయత్నం చేసిన తర్వాత.. దావూద్ అనుచరుడు చోటా షకీల్ బృందం లక్డావాలాపై దాడి చేసింది. బ్యాంకాక్‌లో ఓ మార్కెట్లో కాల్పులు జరిపారు. ఆ సమయంలో తాయత్తు తన జేబులో ఉండడం వల్ల బుల్లెట్లు శరీరంలోకి వెళ్లలేదని చెప్పుకొచ్చాడు లక్డావాలా.
ఈ క్రమంలో 2008లో చోటా రాజన్ నుంచి విడిపోయి స్వతంత్రంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు లక్డావాలా. 2000 సంవత్సరంలో దావూద్ సన్నిహితుడు మున్నా జింగాడా అలియాస్ సయ్యద్ ముద్దస్సార్ హుస్సేన్ చోటా రాజన్‌పై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో దావూద్‌కు సాయం చేసిన నేపాల్ పార్లమెంట్ సభ్యుడిని హతమార్చాడు మల్హోత్రా.
బ్యాంకాక్‌లో దాడి జరిగినప్పుడే అంతా లక్డావాలా చనిపోయాడనుకున్నారు. కానీ అతడు దావూద్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్‌కు వెళ్లాడు. గత కొన్నేళ్లుగా లక్డావాలా నకిలీ వీసాతో నేపాల్‌లో ఉంటున్నాడు.