కరోనా మహమ్మారి సామాన్య ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులు, మంత్రులనూ వదలట్లేదు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్లో మరో మంత్రి ప్రాణాలు కోల్పోయారు. భాజపా నేత, కేబినెట్ మంత్రి ఛేతన్ చౌహాన్ మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది.
భారత మాజీ క్రికెటర్, నౌగవాన్సదత్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఛేతన్ చౌహాన్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో సైనిక్ వెల్ఫేర్, హోంగార్డ్స్, పీఆర్డీ, పౌర భద్రత శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు(1991,1998)లో అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఛేతన్ చౌహాన్‌కు భార్య, కుమారుడు వినాయక్ ఉన్నారు.
చౌహాన్‌కు జులైలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆసుపత్రిలో చేరిన క్రమంలో కిడ్నీలు, రక్తపోటు సమస్య ఏర్పడింది. దాంతో ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. తొలుత లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ వైద్య కళాశాలలో చేరిన చౌహాన్‌ను.. అనంతరం హరియాణాలోని గురుగావూన్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
సాంకేతిక విద్యాశాఖ మంత్రి..
ఆగస్టు 2న ఉత్తర్‌ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ (62) కరోనాతో లఖ్‌నవూలోని ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్‌బాగ్ నిరసనకారుడు అలీ