తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభాపట్టిక (ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా నిరసనకారులు, ముఖ్యంగా ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ప్లకార్డులు, జాతీయం జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. వలజా రోడ్డు నుంచి సచివాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. మరోవైపు శాససనభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్రంలోని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. మధురై, తిరునల్వేలితో పాటు పలు ప్రధాన నగరాల్లో ముస్లిం సంఘాలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి.